హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కీలకమైన సేవలను అందించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) ఏర్పాటుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు అంచనా వేసుకొని.. ప్రజలకు విస్తృత సేవలను అందించేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ.. అక్రమ నిర్మాణాల నియంత్రణ.. ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలనేది ప్రభుత్వ యోచనలో ఉందట. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం ఆలోచన చేస్తున్నారట.
హైడ్రా ఏర్పాటుకు వీలుగా ఇప్పుడున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మెనేజ్‌మెంట్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని వారం రోజుల కిందటే సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహిస్తుంది.