కాంగ్రెస్ లో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా ‘ నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ వేదికగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామనే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీలో పని చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయాలు తీసుకుంది.
ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని అధిష్టానం కోరింది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( పీసీసీ) అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ విభజన సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా సమైక్యాంధ్ర కోసం పోరాడాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ పేరు పెట్టి ఏపీలో పోటీ చేసినా…ఒక్క స్థానం కూడా సాధించలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చే విధంగా కిరణ్ కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పచెప్పాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.