సభ్యత్వాలు రద్వు అవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. 11 మంది ఎమ్మెలక్యేలతో కలిసి సభలో 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారా..? అని ఆమె విమర్శించారు. జగన్ కు ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యం అన్నారు. ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా..? చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలి. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారడం లేదు అని ట్వీట్ చేశారు షర్మిల.
“గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు. ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. బాబు గారి విజన్ 2047కి దమ్ము లేదు. 8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిటిమెంట్ కనిపించలేదు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చింది. రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడొచ్చాయి? 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారు? తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? ఆరోగ్య శ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లించారు? కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ గారు చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటి లేవు” అని ట్వీట్ చేశారు.