వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని, కేంద్ర నిధులొచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చెయ్యలేదని, విశాఖ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్డు కిందే నడుస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించానని, వైకాపా ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. కేవలం బందోబస్తుకే వాడారు తప్ప ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని తెలిపారు. పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీలు లేవని, కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణం పూర్తిచేయలేదని ఫైర్ అయ్యారు.
నేటికీ విశాఖపట్నం జిల్లాలో ఓ పోలీస్టేషన్ రేకుల షెడ్డులోనే నడుపుతున్నారని, ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కనీసం ఠాణాల్లో స్టేషనరీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. అలాగే గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగి, క్రైం రికార్డులో రాష్ట్రాన్ని మూడో స్థానానికి దిగజర్చారని అన్నారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇప్పటికే ఉపసంఘం ఏర్పాటు చేశామని, 100 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలనేదానిపై ఉపసంఘంలో చర్చించడం జరుగుతుందన్నారు.