స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ ని ముద్దాయిగా చూపలేదని.. అందువల్ల ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తరపు న్యాయవాదులు తెలిపారు. ఒకవేళ కేసులో లోకేష్ పేరును చేర్చితే 41 ఏ నిబంధనలు అనుసరిస్తామన్నారు. దీంతో లోకేష్ పిటిషన్ ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది.
లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల పై ఏపీ హైకోర్టులో ఈనెల 4న విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 12 వరకు లోకేష్ ను అరెస్ట్ చేయకూడదని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ధిపొందినట్టు పేర్కొన్నారని.. లోకేష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ ను అరెస్ట్ చేసేందుకు అవకాశమున్నందునే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం లోకేష్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది.