హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పనులపై యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని వ్యాజ్యంలో ఈ ఫౌండేషన్ పేర్కొంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ (గురువారం) విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఏఏజీ వాదిస్తూ.. పురావస్తుశాఖ గర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తున్నామని కోర్టుకు తెలిపారు. చారిత్రక కట్టడాలను కూల్చడం లేదని కోర్టుకు వివరించారు. పరిహారం చెల్లించాకే నిర్మాణం చేపడతామని వెల్లడించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ఏఏజీ సమయం కోరడంతో హైకోర్టు అంగీకరించింది. ఈ నెల 22వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు మెట్రో రెండో దశలోని కారిడార్-6ను ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ మెట్రో మొదటి దశలోనే పూర్తి చేయాల్సి ఉండగా, ఆస్తుల సేకరణ, అలైన్‌మెంట్ వివాదాలతో పదేళ్లుగా ఆగిపోయిగా తాజాగా రెండో దశలో ఈ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.