పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. వీడియో ద్వారా స్పందించారు. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్ కి పంపాలంటే భయమేస్తోందని… ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా? అంటూ ప్రశ్నించారు రోజా. గత నెల 29 న అదృశ్యమైన పాప నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లో నే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని ఆగ్రహించారు. వారం తర్వాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించిందంటే ఈ హోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు? అంటూ మండిపడ్డారు.
ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని నిప్పులు చెరిగారు. మహిళల, పసిబిడ్డ ల భద్రత కోసం ఎవరూ లేరన్నారు. తప్పుడు కేసులు పెట్టడానికి మదనపల్లి ఫైల్స్ అని ప్రత్యేక హెలికాప్టర్ నుa పంపిన ప్రభుత్వం ఫైల్స్ కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా? లోకేష్ నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే పాలించే అర్హత వీళ్ళకు ఉందా? అని ప్రశ్నించారు. హోంమంత్రి పక్క నియోజకవర్గం లో రాంబిల్లి లో ఒక యువతి కాపాడమని కోరినా పట్టించుకోకపోవడం తో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడని ఆగ్రహించారు రోజా.