గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు ఉపాధ్యాయుల బదిలీల పేరిట భారీ అవినీతి జరిగిందని బాధితులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా శాఖామంత్రి నారా లోకేష్‌ను బాధితులు తాజాగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం తమకు పీజీటీలుగా ఉపాధి కల్పిస్తే.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తమను అకారణంగా తొలగించి లంచం డిమాండ్ చేశారని బాధితుల ఆరోపణలు చేశారు.
లంచంఎంత ఇస్తారో చెప్పాలని అంటూ బొత్స ఓసారి, సజ్జల మరోసారి బహిరంగంగానే తమ దగ్గర డిమాండ్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సైతం తమని అవహేళన చేశారని వాపోయారు. తమ ఉద్యోగాలు తొలగింపు అన్యాయమని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సైతం లెక్కచేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించి న్యాయం చేస్తానని బాధితులకు లోకేష్ హామీ ఇచ్చారు.