ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 84.32 శాతం మంది పాసయ్యారు. 96.37 శాతంతో మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉంది. అయితే ఈ ఫలితాల్లో ఓ విద్యార్థినికి 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించింది. ఇంతకీ ఆమె ఎవరంటే?
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతి పరీక్షలో 100, 99, 100, 100, 100, 100 మార్కులు సాధించింది. ఒక్క హిందీలో తప్ప మిగతా అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద సాధించింది. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన మనస్వీకి చదవంటే ఎంతో ఇష్టమట. ఏదో చదివాం అన్నట్లు బట్టీ పట్టి కాకుండా టాపిక్ను అర్థం చేసుకోవడం ఈ విద్యార్థినికి అలవాటట. అందుకే ఇంత మంచి మార్కులు సాధించింది. తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్ కూడా ఎంతగానో పనికొచ్చిందని మనస్వీ చెప్పింది. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.