పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

-

సరదాగా స్నేహితులంతా కలిసి బీచ్ కు వెళ్లారు. సముద్ర తీరంలో కాసేపు సేద తీరారు. కేరింతలు కొడుతూ కోలాహలం చేశారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఇంతలోనే ఊహించని ప్రమాదం. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితులను ఒక్కసారిగా సముద్రం తన ఒడిలోకి లాక్కెళ్లింది. కళ్లముందే తమ ప్రాణ స్నేహితులు అలల తాకిడికి కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేక.. కాపాడలేక మిగతా వాళ్లంతా గుండెలవిసేలా రోదించారు. ఈ విషాద ఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది.

అనకాపల్లి పూడిమడక సముద్రతీరంలో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అనకాపల్లిలోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్ కు వెళ్లారు. అప్పటిదాకా సముద్ర తీరంలో సందడిగా గడిపారు. 15 మందిలో ఐదుగురు సముద్ర అలల తాకిడికి కొట్టుకుపోయారు. మిగతా 10 మంది సురక్షితంగా ఉన్నారు. స్నేహితులు సముద్రంలో గల్లంతైన విషయాన్ని మిగతా వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దించి గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news