ఏపీ రైతులకు శుభవార్త..శనగ విత్తనాల ఉచిత పంపిణీ చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రకటించారు. అన్నదాతలకు అండగా ఉండటంలో ఈ దేశంలోనే జగనన్న ప్రభుత్వం ఆదర్శంగా ఉందని తెలిపారు. మిచౌంగ్ తుపాను ధాటికి దెబ్బతిన్న పంట పొలాలను శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరిశీలించారు.
నాదెండ్ల మండలం తూబాడు,గున్నవారిపాలెం, రాజుగారిపాలెం, బుక్కాపురం తదితర గ్రామాల పరిధిలో పంట పొలాలను మంత్రి రజినీ సందర్శించారు. ఈ సందర్భంగా మంచి శనగ పంట మొలక దశలో ఉండగానే భారీ వర్షాలు వచ్చాయని తెలిపారు. పంట మొత్తం దెబ్బతిన్నదని చెప్పారు. బాధిత రైతులందరికీ వారం రోజుల్లో మళ్లీ ఉచితంగా శనగ విత్తనాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. మిర్చి, పత్తి.. ఇతర పంటలకు వాటిల్లిన నష్టాన్ని కూడా అధికారులు అంచనావేస్తున్నారని పేర్కొన్నారు.