తెలంగాణలో సంక్రాంతి సంబురం మొదలైంది. తెల్లవారుజామునే ఆడవాళ్లంతా వాకిళ్ల ముంగిట చేరి రంగవళ్లులు తీర్చిదిద్దుతున్నారు. పిల్లాపెద్దలతో వాడలన్నీ కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు ప్రజలకు, అభిమానులకు పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు ప్రజలందరికి సంక్రాంతి పండుగ విషెస్ చెప్పారు.
సుఖశాంతుల సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే కొత్త వెలుగు అని అర్థం అలాంటి సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణ మహా సంరభం సమీపిస్తున్న తరుణంలో జనవరి 14వ తేదీన ప్రజలంతా తమకు సమీపంలో ఉన్న దేవాలయాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని కిషన్ రెడ్డి కోరారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.