ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రాభివృద్ధి పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కర్ణాటక, తెలంగాణలో క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.
కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తాం అన్నారు. జగన్ హయాంలో మంత్రుల మాదిరి మేం గంగిరెద్దులా పనిచేయం అని తేల్చి చెప్పారు. మంత్రులకు సీఎం చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారు అని తెలియజేశారు. పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్ ఇసుక రంగాల్లో అవినీతి చేసింది. ప్రజల సొమ్ము తిన్న వారిపై చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విశాఖ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.