ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు జైలులో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనిని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మంగళవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భద్రత విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అడగాలన్నారు. ఏదైనా లోపం జరిగితే దానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కాదని.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రమేయం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు.
తమ ప్రభుత్వం తప్పు చేస్తే కేంద్రానికి కాదు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ అరెస్టు రాత్రికి రాత్రి జరగలేదని.. అనేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసిన తర్వాత అవినీతి జరిగినట్లు తేలిందని వెల్లడించారు. మరోవైపు మహిళా బిల్లుపై స్పందించారు బొత్స. కేంద్రం ప్రతిపాదించిన ఆ బిల్లుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% స్థానాలు కేటాయించిన ఘనత తమదేనని అన్నారు.