ఏపీ విభజన కంటే..జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందంటూ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు విజనరీ నాయకుడన్న గవర్నర్.. 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామన్నారు.
సూపర్‌సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించాం.. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని వివరించారు. సామాజిక భద్రత పెన్షన్లను రూ.4వేలకు పెంచాం.. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు గవర్నర్.