పంచాయతీలకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మాణాలు చేయనున్నారని తెలియజేశారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నామన్నారు. దీని ద్వారా మొత్తం 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. సంస్కరణల్లో భాగంగా జాతీయ పండుగల నిర్వహణకు మైనర్ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.25 వేలు నిధులను పెంచినట్టు తెలిపారు. పంచాయతీల ప్రత్యేకతను గుర్తించి ఆదాయం సృష్టిస్తామని తెలిపారు. విశాఖ జిల్లాలోని ఆనందపురం పువ్వులు, అరకు కాఫీకి ప్రత్యేకత అని తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే అలాగే అన్నింటిని గుర్తిస్తామన్నారు.