భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో మరో బాంబు పేల్చింది వాతావరణ శాఖ. ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పశ్చిమ, మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన వాయుగుండం గత కొన్ని గంటలలో 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్యదిశగా కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం దాదాపు ఉత్తరం వైపుగా ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదిలి, రాగల 24 గంటలలో తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రైయిన్ లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.