అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు మరికొన్ని గంటల్లో భారత్‌లోకి ప్రవేశించనున్నాయి. రఫేల్ రాక కోసం భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విమానాలు అంబాలాకు రానున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. అంబాలా ఎయిర్‌బేస్ పరిసర ప్రాంతాలలో మంగళవారం నుంచే 144 సెక్షన్ విధించింది.
భారత వైమానిక దళ అమ్ముల పొదిలోకి చేరేందుకు రఫేల్ విమానాలు సోమవారమే ప్రయాణం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరం మెరినాక్ వైమానికి స్థావరం నుంచి బయలుదేరిన ఐదు జెట్లు పది గంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఆల్ ధాఫ్రా వైమానికి స్థావరంలో దిగాయి. అక్కడి నుంచి హరియాణాలోని అంబాలాకు ఈ రోజు మధ్యాహ్నం చేరుకోనున్నాయి. మొత్తం ఏడు వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో రఫేల్ జెట్లు గాలిలోనే ఇంధనాన్ని నింపుకోనుండగా.. అందుకోసం ఫ్రాన్స్ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్ విమానాన్ని ఏర్పాటు చేసింది.
లాంగ్ రేంజ్ మిటియార్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు కలిగిన అత్యాధునిక యుద్ధ విమానమే ఈ రఫేల్. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణుల సొంతం. శత్రువులపై పోరాటంలో రఫేల్ ఓ గేమ్‌ఛేంజర్‌గా మారనుందని వాయుసేన ధీమాగా ఉంది.