పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

-

ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. నూతన ప్రభుత్వం చేపట్టిన తొలి అతిపెద్ద కార్యక్రమం ఇది. రూ.7,000 చొప్పున పింఛను అందజేయడమనేది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. గుంటూరు జిల్లా పెనుమాకలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన మంగళగిరి నియోజకవర్గం పెనుమాక చేరుకోగా.. ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65.18 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు.

ప్రజల వద్దకే పాలన దిశగా చంద్రబాబు నాయుడు తొలి అడుగు వేశారు. మిగతాచోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను ఇస్తున్నారు. అవసరమైన చోట్ల ఇతర శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తిచేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛనుదారులను కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news