భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ” గొప్ప రాజనీతిజ్ఞుడు, దురదృష్టి గల ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ మృతికి భారతదేశం మొత్తం సంతాపం తెలుపుతోంది. ఆయన నాయకత్వం దేశ గమనాన్నే మార్చేసింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
ఇక మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. వయసు రిత్యా తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇక ఆయన భౌతికకాయానికి నేడు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఆయన నివాసంలో ప్రజలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
డిసెంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటలకు ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించి, ఉదయం 8:30 గంటలకు ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇక రేపు ఉదయం 9:30 గంటలకు మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.