ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకి బీజేపీ తరఫున బీసీ సంఘం జాతీయ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయనకు.. బీజేపీ అదే పదవిని కట్టబెట్టింది. మెడలో కాషాయ కండువాతో పార్లమెంట్ ఆవరణలో కనిపించిన ఆర్.కృష్ణయ్య.. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, వాళ్లే పిలిచి టికెట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీలో ఉన్న బీసీల కోసమే పని చేస్తానని తెలిపారు. కేంద్రంలో బీసీల నాయకత్వమే ఎక్కువ అని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. ఇక తాను పార్టీలు మారడం లేదని.. తన వద్దకే పార్టీలు వస్తున్నాయని గుర్తు చేశారు. తాను బీసీల కోసం చేస్తున్న సేవలను గుర్తించి బీజేపీ తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించిందన్నారు ఆర్.కృష్ణయ్య.