బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ కంటే తన ఫాం హౌస్ గొప్ప అనుకుంటూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే పార్లమెంటరీ విధానాలను పాటించకుండా కేసీఆర్ కించపరుస్తున్నాడని విమర్శించారు శ్రీనివాస్ రెడ్డి. పార్లమెంటరీ విధానాల కంటే తమ కుటుంబం ఎక్కువ అన్న భ్రమలో కేసీఆర్ కుటుంబ వైఖరీ ఉందని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ కంటే కూడా తమ ఫాం హౌస్ ఎక్కువ అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు సైతం సెక్రటేరియట్ రాకుండా సీఎంగా ఎవ్వరినీ కలువకుండా కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని విమర్శించారు. సెక్రెటేరియట్ లో ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పుబడుతున్న కేసీఆర్ కుటుంబం ఉద్యమకాలంలో తెలంగాణ భవన్ లో రూపకల్పన చేసిన తెలంగాణ విగ్రహం పై అధికారంలో ఉన్నప్పుడు వారు అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టి ఆమోదించే ప్రయత్నం చేయలేదని నిలదీశారు.