ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. విజయవాడ నగరం సింగ్ నగర్ లో వరద బాధితులు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలంగా మారిన విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా.
చిన్నపిల్లలు, మహిళలు, వృద్దులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదన్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడడానికి, ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు రోజా. బాధితుల మాటలు వింటుంటే నాలుగు రోజుల నుండి వాళ్ళు ఎంత నరకం అనుభవించారో అర్థం అవుతుందన్నారు. వర్షాలపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.
కనీస భోజనం అందించడంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. మంగళగిరి నీట మునిగితే లోకేష్ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారని.. ఇప్పటికైనా ప్రజలను కాపాడాలని కోరారు. చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా.. ప్రజలను ఆదుకోలేకపోయారంటే ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.