తమ్మినేని సీతారామ్. సీనియర్ రాజకీయ నాయకుడు, చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా చక్రం తిప్పిన నాయకుడు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు. నిజానికి ఇద పెద్ద పదవి. మరి పెద్ద పదవికి ఆయన హుందాతనం తెస్తున్నారా ? పాలనలోను, ప్రభుత్వ పరంగాను ఎదురయ్యే చిన్నపాటి లోపాలను ఆయన తనదైన శైలిలో పరిష్కరించి, ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా తన పరిధిలో పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్నారు. అదే సమయంలో చిన్నపాటి విభేదాలను పక్కన పెట్టిమరీ.. పార్టీలో అందరినీ కలుపుకొని పోవాల్సి కూడా ఉంది.
అయితే, స్పీకర్ తమ్మినేని వ్యవహార శైలిపై అటు జిల్లా శ్రీకాకుళంలోను, ఇటు రాష్ట్రంలోనూ కూడా ఆశించిన విధంగా లేదని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని అందరికీ తల నొప్పిగా పరిణమించారనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. ఇక, ప్రభుత్వాన్ని అడుగడుగునా వెను కేసుకురావా ల్సిన ఆయనే.. చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆముదాలవలసలో తన సొంత మరిది, టీడీపీ నాయకుడు, మాజీ విప్ కూన రవికుమార్ దూకుడు కూడా ఆయన అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.
అదే సమయంలో సొంత పార్టీ వైసీపీలోనూ నాయకులతో విభేదాలు ఆయన కొనసాగిస్తున్నారనేది ప్రధాన విమర్శ. మంత్రి కృష్ణదాస్ సహా ఆయన సోదరుడు, సీనియర్ నాయకుడు ప్రసాదరావుతోనూ స్పీకర్ కలివిడిగా లేరని పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా లాక్‌డౌన్ సమయంలోనూ జిల్లాలో మద్యం ఏరులై పారుతోందని మీడియాలో రాగానే వెంటనే స్పీకర్ రియాక్ట్ అయ్యారు. అయితే, సంయమనంతో మాట్లాడాల్సిన ఆయనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వేస్ట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే ప్రతిపక్షాలకు మరిన్ని అస్త్రాలు అందించినట్టయింది.
ఇక, నాయకులతోనూ ఆయన సఖ్యత చూపకపోవడం కూడా పార్టీ బలపడేందుకు అవకాశం లేకుండా పోతోంది. మరి స్పీకర్ స్థాయి నాయకుడు ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఒక్కోసారి నోరు జారి మాట్లాడడం కూడా ప్రభుత్వానికి, పార్టీకి మైనస్‌గా మారింది. మరి తమ్మినేని ఇకనైనా తన తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.