జగన్ కి అసలు విషయం తెలియక ఎగిరెగిరి పడుతున్నారు : సీపీఐ నారాయణ

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారన్న విషయాన్ని మోడీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదన్నారు. మోడీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మోడీని ఎలా నమ్మలేదు.. కేసీఆర్ ను కూడా అలానే అనుమానించాల్సి ఉంటుందని నారాయణ వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు ప్రకటన చనిపోయే ముందు తులసి తీర్థం పోసినట్లు ఉందన్నారు.


మోడీ చెప్పాల్సిన అసలు రహస్యం ఏపీలో విలువైన ఇసుక బీచ్ లు అదానీకి అప్పగించిన విషయం. లిక్కర్ స్కాంలో ఉన్న బీఆర్ఎస్, వైసీపీ పార్టీలు బీజేపీతో కలిసిపోయాయి. మిగతా వాళ్ళను జైల్లో ఉంచుతున్నారు. రూ. వేల కోట్లు తిన్న వాళ్లు బయట ఉన్నారు. రూ.వందల కోట్లు అవినీతి పేరుతో చంద్రబాబును జైల్లో పెట్టారు. ఆయనను అక్రమ పద్ధతిలో అరెస్టు చేశారు. అది సరికాదు. ఆయనేం దేశం వదిలి పారిపోయే వ్యక్తి కాదు. కేంద్రంలో మోడీ, ఏపీలో జగన్ ప్రతిపక్ష నేతలను మానసికంగా ఇబ్బందులు పెట్టేలా వారిపై కేసులు పెడుతున్నారు.

చంద్రబాబును దెబ్బకొడితే బీజేపీకి బూస్ట్ అవుతుందనేది మోదీ ప్లాన్. ఎన్నో కేసులు ఉన్న జగన్ ను పక్కన పెట్టేయడం ఆయనకు పెద్ద పనేం కాదు. జగన్ కు ఈ విషయం అర్థంకాక ఎగిరెగిరి పడుతున్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదు. దేశంలో నిజమైన కూటమి అంటే బీజేపీ – భారాస – ఎంఐఎం. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశం ఉత్తర భారత్, దక్షిణ భారత్ అంటూ విడిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు నిశ్చితార్థం వరకే వచ్చింది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version