మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తాజాగా తిరిగి వైసీపీ లో చేరి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవల వైఎస్ షర్మిల తోనే నా ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తిరిగి వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ను తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని అన్నారు. సీఎం జగన్ ను తిట్టమనడం తనకు నచ్చలేదని తెలిపారు. సీఎం జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడని కొనియాడారు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో పద్దతి పాడు ఏమి లేదని విమర్శించారు. రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ.. షర్మిల విధానం అలా లేదు.. కేవలం వ్యక్తిగతంగానే ఉంటుందని ఆరోపణలు చేశారు. ఈ విషయం పై ఎన్నోసార్లు షర్మిల తో పాటు పార్టీకి చెప్పి చూశానని.. అయినా వారు పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్ పై వ్యక్తిగతంగా వెళ్లడం తనకు నచ్చలేదని.. అందుకే షర్మిల తో నడవడం ఇష్టం లేక సొంత గూటికి వచ్చినట్లు తెలిపారు.