గ్రామపంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి.. డిసెంబర్ లో ఎన్నికలు..?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదికావొస్తున్నా.. పార్టీల మధ్య పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు.. నువ్వా నేనా అన్నట్లు కాంగ్రెస్, బిఆర్ఎస్ బిజెపి నేతలు మాటల యుద్ధానికి తెర లేపుతున్నారు.. అంశం ఏదైనా సరే.. తూటాలాంటి మాటలతో అధికార పార్టీపై అప్పర్ హ్యాండ్ సాధించేందుకు విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.. ఈ క్రమంలో మరో ఎన్నికల సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.. గ్రాడ్యుయేట్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కొనసాగుతున్న నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది..

గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్లో గా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.. సంక్రాంతి కల్లా కొత్తపాలనా వ్యవస్థను కొలువు తీర్చేందుకు ఒడిఒడిగా అడుగులు వేస్తోంది.. అన్ని కలిసొస్తే డిసెంబర్ లేదంటే జనవరి నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తుందన్న ప్రచారం జరుగుతుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో.. గ్రామాలలో పట్టు పెంచుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. బీసీ కుల గణన ముగిసిన వెంటనే సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయని చర్చ నడుస్తోంది..

ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచ్ పదవి కాలం ముగిసింది.. దీంతో ప్రభుత్వం స్పెషలాఫీసర్లు నియమించి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది. ప్రస్తుతం వారి ఆధ్వర్యంలోనే పాలన కొనసాగుతోంది.. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తొలుతా భావించింది.. అయితే పాత రిజర్వేషన్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారని విపక్షాలు ఆరోపణలు చేయడంతో.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో బీసీ కులగణనకు శ్రీకారం చుట్టింది .. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు పట్టుబట్టడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..

డిసెంబర్ చివరి నాటికి బీసీ కులగణన పూర్తి చేసిన వెంటనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.. అందుకు అనుగుణంగా గ్రామాలలో పట్టు పెంచుకునేందుకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.. బీసీ కుల గణనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే బీసీ నేతలకు సూచించారు.. లోకల్ బాడీ ఎలక్షన్స్ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇలాంటి సూచనలు చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాలలో బలంగా ఉంది.. దానికి తోడు బిజెపి కూడా కొన్ని గ్రామాలలో తమ ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఉండడంతో అధికార పార్టీకి ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి.. అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకుని గ్రామస్థాయిలో పట్టు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version