తిరుమల అంశాన్ని వైసీపీ పొలిటికల్ ఈవెంట్ లా మార్చేస్తుందని మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్.. దయచేసి మీరు చేసిన పాపాలు చాలు, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని అన్నారు.
తిరుమలలో కల్తీ నెయ్యి వాడారు అనేది వాస్తవం, అపచారం జరిగిందన్నది నిజమన్నారు. కావాలంటే మేము ఇస్తున్న లడ్డును మీరు పరీక్షించుకోవాలని సూచించారు. మీకు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు.. కానీ ఆ దేవుడిని నమ్మే కోట్లాదిమంది ఇక్కడ ఉన్నామన్నారు. రాష్ట్రంలో పాలకుడి మార్పుతోనే ప్రతి రంగంలో మార్పు మొదలైందన్నారు.
ధర్మ ప్రచారం, ధర్మ పరిరక్షణలో కూడా మార్పు మొదలైందని.. తప్పులు సరిదిద్దే క్రమంలోని నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులందరిని చట్టం ముందు ఉంచుతామన్నారు. భవిష్యత్తులో ఎన్ని పాపాలు వెలుగులోకి వస్తాయో..? ఆలస్యం అవుతుందేమో కానీ శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. జగన్ తిరుమలకు వెళితే డిక్లరేషన్ లో సంతకం చేయాలని వ్యాఖ్యానించారు పయ్యావుల.