ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. ఇక తిరుమల నుంచి ఇవాళ తిరిగి వచ్చిన అనంతరం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై కూడా దృష్టి సారిస్తారు.
మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. ఈరోజు ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు. జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. పవన్ కల్యాణ్‌ను ఉపముఖ్యమంత్రిని చేయడంతోపాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించనున్నట్లు తెలిసింది.