ఏపీ ప్రభుత్వానికి కృష్ణా ట్రైబ్యునల్ గట్టి షాక్ ఇచ్చింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ ఇంటర్‌లొకేటరీ వేసిన అప్లికేషన్‌ను తిరస్కరించింది. తెలంగాణ 90 టీఎంసీల నీరు వాడకుండా ఆపాలని ఏపీ ప్రభుత్వం ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను విచారించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. అయితే, దీనిపై సరైన వేదికకు వెళ్లే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
2022 ఆగస్టులో తెలంగాణ ఇచ్చిన జీవో 246పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు వేసింది. దీంతో ట్రైబ్యునల్‌లో జులై 14 వరకు వాదనలు జరిగాయి. తాజాగా ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై విచారణ అధికారం తమకు లేదని.. తగిన వేదికలను ఆశ్రయించాలని తుది ఉత్తర్వుల్లో ట్రైబ్యునల్ పేర్కొంది.
పాలమూరు ప్రాజెక్ట్‌పై కృష్ణా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌పై కృష్ణా ట్రెబ్యునల్ తీర్పును మంత్రి స్వాగతించారు. ఇది పాలమూరు విజయంగా అభివర్ణించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90టీఎంసీల వరకు కృష్ణా జలాలు తీసుకోవచ్చని తెలిపారు.