తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రజల కోసం ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లే పనిలో పడింది. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది.
విస్తృతంగా జనంలోకి వెళ్లడంపై దృష్టిసారించిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఇతర సీనియర్ నాయకులంతా ఇందులో పాల్గొననున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. బస్సు యాత్రతో సమాంతరంగా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
ఇప్పటికే భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారు. వారి సమస్యలు తెలుసుకుంటూ తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బస్సు యాత్రతో మరోసారి జనంలోకి వెళ్లి.. తమ గ్యారెంటీలను ప్రజలకు వివరించనున్నారు.