నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి చిరుత సంచారం సీసీకెమెరాల్లో రికార్డయింది. అర్ధరాత్రి సమయంలో టోల్ గేట్ చెకింగ్ పాయింట్ పక్కన చిరుతపులి సంచించిన వీడియోలు రికార్డయ్యాయి. టోల్ గెట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి చిరుతపులి నోటితో పట్టుకుని వెళ్లింది. ఈ దృశ్యాలు అక్కడి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీసిన అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చిరుతను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వీలైనంత త్వరలో చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలెవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. అయితే చిరుత దొరికే వరకు ప్రజలు రాత్రిపూట అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు. ఇటీవల చిరుతపులు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎక్కువవుతుండటం గమనార్హం.