అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభం, నాడు-నేడు పనుల శంకుస్థాపనకు హాజరయ్యారు. ఆయన పర్యటనకు సంబంధించి ముందుస్తుగా సమాచారం ఇవ్వకపోవడంపై, ప్రొటోకాల్ పాటించకపోవడంపై స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కాన్వాయ్ కి అడ్డుగా కూర్చున్నారు. ఎమ్మెల్యే గోబ్యాక్… ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కాన్వాయ్ ముందు బైఠాయించిన గుడివాడ సర్పంచి శ్రీనుబాబు, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైకాపా నేతల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో గుడివాడ సర్పంచి శ్రీనుబాబు గాయపడగా, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, వైస్ ఎంపీపీ అప్పలరాజు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు నాయకులను చెదరగొట్టడంతో అంగన్వాడీ ప్రారంభం, నాడు- నేడు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అక్కడనుంచి వెనుదిరిగారు.