పార్టీ నియమాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ అధిష్టానం మరోసారి స్పష్టం చేసింది. అలా నియమాలను మీరిన నిజామాబాద్ కు చెందిన కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణల సంఘం. పార్టీ క్రమశిక్షణ
ఉల్లంఘించినందుకు గాను వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గత అక్టోబరులో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ను, పార్టీని దూషించినందుకు పార్టీ అధిష్టానం సీరియస్ గా పరిగణించి, చర్యలకు ఉపక్రమించింది.
ఆ ఘటనపై నవంబర్ 21 నాటికి సమాధానం ఇవ్వాల్సిందిగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై 2024 నవంబర్ 20వ తేదీన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సుభాష్ రెడ్డి సమాధానంపై సంతృప్తి చెందని పార్టీ అధినాయకత్వం, క్రమశిక్షణ సంఘం శుక్రవారం అతనిపై వేటువేసింది. తాము ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి బహిష్కరణ నిర్ణయం అమల్లోకి వస్తుందని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.