బంగాళాఖాతంలో ఈ నెల 15వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 14వ తేదీ నుంచి ఈశాన్య, తూర్పు గాలులు బలోపేతం అవుతాయని వివరించింది. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉత్తర కోస్తా తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఆ ద్రోనీ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు ఐఎండి తెలిపింది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనున్నట్లు పేర్కొంది. సీజన్స్ లేట్ అక్టోబర్ లో పడాల్సిన వర్షం నవంబర్ లో పడుతోందని వాతావరణశాఖ చెప్పింది. నవంబర్ మూడోవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరగనున్నట్లు హెచ్చరించింది.