నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పారు. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయు గుండంగా మారే అవకాశముందని అంచనా వేశారు.
ఈ వాయుగుండం ప్రభావంతో బుధవారం (మే 23వ తేదీన) ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించారు. ఇక మంగళవారం రోజున (మే 21వ తేదీ) కర్నూలు, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.