రాజధాని పనులన్నీ మళ్లీ మొదలు పెట్టే పనిలో ఉన్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రస్తుతం రాజధాని పనుల నిధుల వ్యయం సైతం భారీగా పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం పనుల్లో జాప్యం చేసిందని, దాని వల్ల నిధులు కూడా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందని చెప్పారు. వేలకోట్ల నష్టం వచ్చేలా చేసిందని తెలిపారు.
ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని వైసీపీ నాయకులపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం 2014లో ఏ నిర్మాణాలు జరిగాయో.. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వం ఒక ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు. ఏపీ ప్రజలకు పోలవరం ప్రాజెక్టు సైతం చాలా అవసరమని చెప్పారు. జగన్ హయాంలో వైసీపీ నాయకులు వేల కోట్ల విలువైన భూములను దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు.