ఏపీ విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ బ్లాక్ అయిందట. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు. ప్రజా సమస్యలు, వినతులను ఇక నుంచి [email protected] కు మెయిల్ చేయాలని ఆయన సూచించారు. వాటిని తానే పరిశీలించి పరిష్కరిస్తానని ఓ ప్రకటన చేశారు. పెద్దఎత్తున వస్తున్న సందేశాలతో వాట్సాప్ బ్లాక్ అయినట్లు సమాచారం.
‘‘నా వాట్సప్ ఖాతా తరచూ బ్లాక్ అవుతోంది. అందుకే నా వ్యక్తిగత ఈ మెయిల్ అడ్రస్‌ను ఇస్తున్నాను. సాయం కోసం వచ్చే ప్రజల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’’ అని నారా లోకేశ్ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. పేరు, ఊరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, సమస్య, ఏ సాయం కోరుతున్నారో వినతుల్లో పేర్కొనాలని ఆయన సూచించారు. లోకేశ్ ఇప్పటికే ఉండవల్లిలోని నివాసంలో రోజూ ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి మెయిల్ ద్వారా కూడా ప్రజల ఇబ్బందులను తెలుసుకొని, పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు.