తన కొడుకు బోర్డర్ లో 14 మంది పాక్ ముష్కరులను మట్టుపెట్టి చివరికీ తాను వీరమరణం పొందాడని మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ తెలిపారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీ నాయక్ నిన్న రాత్రి సరిహద్దుల్లో చొరబాటు దారుల కాల్పుల్లో మృతి చెందాడు. ఆయన తండ్రి శ్రీరాం నాయక్ తనను కలిసిన విలేకరులకు పలు విషయాలను వివరించారు. మురళీ నాయక్ రెండేళ్ల కిందట ఉద్యోగంలో చేరాడని 2022 నవంబర్ 08న అగ్నీవీర్ రిక్రూర్ట్ మెంట్ లో సెలక్ట్ అయి ఉద్యోగంలో చేరాడని తెలిపారు.
అతనికీ మొత్తం నాలుగేళ్లు అగ్రిమెంట్ ఉందన్నారు. ఆ అగ్రిమెంట్ వచ్చే ఏడాది నవంబర్ తో ముగుస్తుందన్నారు. ఇవాళ ఉదయం మిలటరీ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. తన భార్య ఫోన్ ఎత్తగా ఆమెకు హిందీ అర్థం కాలేదని.. మురళీ గురించి మాట్లాడుతున్నారని గమనించి తనకు ఫోన్ ఇచ్చిందన్నారు. అటు నుంచి వారు రాత్రి జరిగిన కాల్పుల గురించి చెప్పారని అన్నారు.