కాంగ్రెస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారని, ఐదేళ్లు దీని ఫలితం అనుభవించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు విని రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని, ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలు అమలు కోసం నిరంతరం పట్టుబడుతామని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి దివాళాకోరు ముఖ్యమంత్రి అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారన్న రేవంత్ ను.. దొంగను దొంగలా చూడకపోతే ఎలా చూస్తారని విమర్శించారు. గుడిలో చెప్పులు ఎత్తుకుపోయేవారిలా చూస్తున్నారనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఐదేళ్లు శిక్ష అనుభవించక తప్పదంటూ పేర్కొన్నారు. ఉన్న పథకాలను ఎత్తి వేస్తున్న
ప్రభుత్వం కొత్త స్కీంలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, రైతుబంధు,
రుణమాఫీ, పెన్షన్ పెంపు ఇలా ఎన్నో పథకాలు ఆగిపోయాయని విమర్శించారు.