వైసీపీ ప్రభుత్వం నేడు తాజాగా తీసుకువచ్చిన జీవోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకువచ్చారని మండిపడ్డారు. బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్థరాత్రి వేళ హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని మరోసారి బయట పెట్టుకుంది అన్నారు నాదెండ్ల.
జగన్ రెడ్డి పై ప్రజా వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న కౌలు రైతు భరోసా సభల్లో, జన వాని కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విశాఖలో స్వచ్ఛందంగా జనం తరలివచ్చి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని నిర్బంధించడం అందరూ చూశారని అన్నారు.
సీఎం హోదాలో జగన్ బెంజ్ సర్కిల్లో కార్యక్రమాలు చేయలేదా అని ప్రశ్నించారు. బెంజి సర్కిల్లో అన్ని మార్గాలు మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ వాహనాలకు జగనే స్వయంగా జెండాలు ఊపలేదా? అని దుయ్యబట్టారు. అప్పుడు ప్రజలకు కలిగిన ఇబ్బందులు కనిపించలేదా? అని ప్రశ్నించారు.