స్కిల్ డెవలప్మెంట్ సంస్థ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిరోజుల నుంచి నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరసన దీక్ష చేయనున్నారు. మరోవైపు రాజమహేంద్రవరం జైలులో నేడు చంద్రబాబు నిరశన దీక్ష చేపట్టనున్నారు.
మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 5వ తేదీన కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 5వ తేదీ నుంచి యాత్ర మొదట రాయలసీమ జిల్లాల్లో ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టు నాటి నుంచి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో పోరాటం చేస్తున్నారు. వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్న కార్యక్రమాలకు హాజరై కార్యకర్తలకు నైతిక స్థైర్యం అందిస్తున్నారు. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టనున్నారు.