స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. వైసీపీ సర్కార్కు వ్యతిరేంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టనున్నాయి. గాంధీ స్ఫూర్తితో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష చేయనున్నారు. మరోవైపు రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరసన దీక్షలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నారా భువనేశ్వరి నిరసన దీక్ష కొనసాగనుంది. గాంధీ జయంతి సందర్భంగా ‘సత్యమేవ జయతే’ పేరిట భువనేశ్వరి నిరశన దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో సుమారు 8వేల మంది మహిళలు పాల్గొంటారని అంచనా.
ఈ దీక్ష కోసంభువనేశ్వరి ఆదివారం ఉదయం 11.45 గంటలకు రాజమహేంద్రవరంలోని శిబిరం వద్దకు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె హైదరాబాద్ వెళ్లిన విషయం విదితమే. నగరానికి వచ్చిన తరవాత పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, రాజానగరం తెదేపా ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులతో సమావేశమై సోమవారం నిర్వహించనున్న దీక్షపై చర్చించారు.