ప్రస్తుతం టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎనుమువారిపల్లిలో చేనేత కార్మికులను కలిశారు. వైసీపీ పాలనలో నేతన్నలకు గుర్తింపు కార్డులు లేవని లోకేశ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే, చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తామన్న జగన్.. వారిని మోసం చేశారని నారా లోకేశ్ ఆరోపించారు. మదనపల్లె నియోజకవర్గంలో చేనేత కార్మికులతో సమావేశమైన లోకేశ్, నేతన్న నేస్తం సైతం పెద్ద మోసమని విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
లోకేష్ తన పాదయాత్ర 500 కి.మీ.దాటిన సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకి హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ మేరకు హామీలు అమలు చేస్తామని రైతులకు తెలిపారు. ఈ హామీకి గుర్తుగా శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. దీంతో స్ధానిక టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.