పుంగనూరులో దళితనేతపై చిత్రహింసలు హేయం అన్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వైసిపి ప్రైవేటుసైన్యంలా మారిపోయి ప్రతిపక్షపార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకించి పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని ఆగ్రహించారు.

ఎటువంటి కేసులేని టిడిపి దళితనేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణను కల్లూరు సిఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించడమేగాక చేతులు వెనక్కికట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలకు గురిచేయడం తాలిబాన్ రాజ్యాన్ని గుర్తుకు తెస్తోందని ఆగ్రహించారు.
ముఖ్యమంత్రి జగన్ బహిరంగ వేదికలపై నా…నా అంటూ ఎస్సీ, ఎస్టీ, బిసిలపై లేని ప్రేమలు ఒలకబోస్తుంటే వాస్తవంలో ఆయావర్గాలపై ఇదివరకెన్నడూ లేనివిధంగా దారుణాలు కొనసాగుతున్నాయన్నారు. టిడిపి దళితనేతను అక్రమంగా నిర్బంధించి దాడిచేసిన కల్లూరు సిఐపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి తక్షణమే విచారణ జరిపి, ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న రాజ్యహింసను నిలువరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని ప్రకటన విడుదల చేశారు నారా లోకేష్.