మోపిదేవి వెంకటరమణ, పిల్లి శుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన మంత్రిపదవుల స్థానాలను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నదనే వార్తలు వస్తున్నప్పటినుంచీ సీనియర్లు, బలమైన బీసీ నేతలు, గుంటూరు జిల్లా నేతలు తెగ కలలు కంటున్న దశలో ఎవరూ పెద్దగా ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి.
నిన్నమొన్నటివరకూ మోపిదేవి, సుభాస్ చంద్రబోస్ లు ఇద్దరూ బీసీ సామాజిక వర్గం నేతలు అవ్వడంతో మెజారిటీగా బీసీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.. అందులోనూ సీనియర్లు మరీ పెంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా తెరపైకి కొత్తగా ఎమ్మెల్యేలు అయినవారిపేర్లు తెరపైకి వస్తున్నాయి. వారిలో మోపిదేవి స్థానం కోసం.. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరు అన్యూహ్యంగా తెరపైకి వచ్చింది! జగన్ మనసు గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో సిదిరి కూడా ఒకరని.. ఆయనకు అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే క్రమంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంకోసం… కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులూ మోపిదేవి స్థానంలో గుంటూరు జిల్లాకు అవకాశాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో… అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి ల పేర్లు వినిపించగా… బీసీ కోటాలో జంగా కృష్ణమూర్తి, విడతల రజనీ పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా రిజర్వేషన్లు పక్కనపెట్టి… అప్పలరాజు, జోగి రమేష్ లకు జగన్ ఓటు వేసే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి!
నాలుగు రోజులు ఆగితే… వీరి పేర్లే కన్ ఫాం అవుతాయా లేక ఈ నాలుగురోజుల్లో తెరపైకి మరో కొత్త పేర్లు రాబోతున్నాయా అనేది వేచి చూడాలి! ఏది ఏమైనా.. ఫ్రెషర్స్ కి కూడా జగన్ అధిక ప్రాధాన్యత ఇచే అవకాశాలు ఉన్నాయన్నమాట!!