బుడమేరు వరదనీటిలో చిక్కుకొని సర్వం కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బెజవాడ వాసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. భారీ వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయామంటూ రోడ్లపైకి వచ్చి సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వారిని అందిన కాడికి దండుకునే పనిలో పడిపోయారట దొంగలు.
అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి కత్తులతో దొంగలు బెదిరిస్తున్నారని భయాందోళనలకు గురవుతున్నారు వన్ టౌన్ ప్రజలు. దొంగల భారీ నుండి తమని రక్షించాలంటూ బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలంపాడు, శ్రీనగర్ కాలనీలోని మూడు బైకులు చోరీ జరిగాయి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలనీవాసులు.
వరద ప్రాంతాల్లో దొంగలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు బెజవాడ వాసులు. ఇక గురువారం కంటే శుక్రవారం నగరంలోని అజిత్ సింగ్ లోని పలు ప్రాంతాలలోకి మరో అడుగుకి పైగా మళ్ళీ వరద చేరింది. బుడమేరు ముంపు నుంచి తేరుకున్న సమయంలో మళ్ళీ వరద రావడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.