ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ప్రతి నెలలో మూడో శనివారం నో బ్యాగ్ డేగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులకు ఆయన మరో తీపికబురు అందించారు. ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తామని ప్రకటించారు. ఆరోజున విద్యార్థులకు క్విజ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, సమకాలీన అంశాలపై డిబేట్లు, కరెంట్ ఎఫైర్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.