మిగ్‌జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో గాలులు, వర్షాలతో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈదురుగాలులకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. చాలాచోట్ల సబ్‌స్టేషన్లు నీట మునగడంతో.. ముందుజాగ్రత్తగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపేశారు.
విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడటంతో మూడు డిస్కంల పరిధిలోని 14 పట్టణాలు, 74 మండలాల పరిధిలోని 1,637 గ్రామాలు రెండ్రోజులుగా అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సుమారు రూ.14 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు.
ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సోమవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేక ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. ఇక ప్రభుత్వాసుపత్రుల్లో జనరేటర్ల సాయంతో వైద్యసేవలను అందించాల్సి వచ్చింది. తాగునీటి సరఫరా పథకాలకు విద్యుత్ సరఫరా లేక చాలాచోట్ల రెండు రోజులుగా అవి పనిచేయలేదు. వాటర్‌ప్లాంట్లకూ విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందిపడ్డారు.