ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ కి మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీజేపీ అభ్యర్దులు ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి బరిలో నిలిచిన సీఎం రమేశ్ కు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఎలక్షన్ కోడ్ అమలవుతోన్న నేపథ్యంలో … బిజెపి కమలం గుర్తు ఉన్న చీరలను కార్యకర్తలకు పంపిణీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల పై దురుసగా ప్రవర్తించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేస్తున్న సిఎం రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఒక కేసుకు సంబంధించి తనిఖీలు చేస్తున్న డిఆర్‌ఎ అధికారులపై సిఎం రమేష్ దాడికి దిగడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించారు. మరోవైపు ఎలక్షన్ కోడ్ అమలవుతోన్న సమయంలో బిజెపి కమలం గుర్తు ఉన్న చీరలను కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఐపీసీలోని 353,342,506,201,188, 143/ఆర్‌డబ్ల్యు, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సిఎం రమేష్, చోడవరం టిడిపి అభ్యర్థి రాజు సహా ఆరుగురి పేర్లను పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.